Leo (2023) Telugu Movie Review

Leo

లియో మూవీ రివ్యూ

చిత్రం : లియో
తారాగణం : తలపతి విజయ్, సంజయ్ దత్, త్రిష, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్
రచయిత మరియు దర్శకుడు: లోకేష్ కనగరాజ్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
నిర్మాత: లలిత్ కుమార్
సహ నిర్మాత: జగదీష్ పళనిసామి
బ్యానర్: సెవెన్ స్క్రీన్ స్టూడియో
యాక్షన్: అన్బరివ్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
సినిమాటోగ్రాఫర్: మనోజ్ పరమహంస
విడుదల తేదీ : 19 అక్టోబర్ 2023

తలపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం లియో. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

పార్తీబన్ (విజయ్) తన భార్య సత్య (త్రిష)తో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. తన ఫ్యామిలీ అలాగే తను నడిపే కాపీ షాప్ తప్ప పార్తీబన్ కి మరో లోకం తెలియదు. అలాంటి పార్తీబన్ కి గతంలో ఘోరమైన నేర చరిత్ర ఉందని.. అతను లియో దాస్ అని, ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) తన గ్యాంగ్ తో వస్తాడు. ఇంతకీ, ఈ ఆంటోనీ దాస్ ఎవరు ?, అతనికి పార్తీబన్ కి ఉన్న సంబంధం ఏమిటి ?, అసలు లియో ఎవరు ?, ఈ లియో ఎందుకు పార్తీబన్ లాగే ఉన్నాడు ?, చివరకు పార్తీబన్ తనను తన ఫ్యామిలీని ఎలా సేవ్ చేసుకున్నాడు ?, అలాగే పార్తీబన్ – లియో ఒక్కటేనా ?, కాదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

విజయ్ తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు రెండు వేరియేషన్స్ లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ స్ లో విజయ్ చాలా బాగా నటించాడు. మరో కీలక పాత్రలో నటించిన సంజయ్ దత్ కూడా తన నటనతోనే కాకుండా తన లుక్స్ తో కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు.

ఇక సినిమా ఎండ్ లో కీలకమైన పాత్రలో కనిపించిన హీరో అర్జున్ వైల్డ్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ యాక్టింగ్ పరంగా గత తన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో చాలా బాగా నటించారు. హీరోయిన్ గా త్రిష మెప్పించింది. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకుంది.

మన్సూర్ అలీ ఖాన్ మరియు మిస్కిన్ అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా విజయ్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

మైనస్ పాయింట్స్ :

లియో పాత్రను, ఆ పాత్ర తాలూకు ప్లాష్ బ్యాక్ ను బాగా డిజైన్ చేసుకున్న లోకేష్ కనగరాజ్, అంతే స్థాయిలో ఈ లియో సినిమా ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. ముఖ్యంగా ఆసక్తికరంగా కథనాన్ని రాసుకోవడంలో ఆయన విఫలం అయ్యారు. చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా గత తన సినిమాల శైలిలోనే లోకేష్ కనకరాజ్ ఈ సినిమాని కూడా రెగ్యులర్ ప్లేతోనే నడిపారు.

పైగా కొన్ని సన్నివేశాలు మినహా ఎక్కడా ఫ్రెష్ నెస్ కనిపించదు. ఫస్ట్ హాఫ్ ను వేగంగా నడిపిన ఆయన సెకెండాఫ్ ని మాత్రం మరీ సాగతీశారు. ఒక్క క్లైమాక్స్ లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకతను పెంచటంలో విఫలమయ్యారు. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ ఆయన మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు.

ఇక కథను మలుపు తిప్పే ప్రదాన పాత్రలు అయిన సంజయ్ దత్, అర్జున్ పాతలను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి.. అంతే ఎఫెక్టివ్ గా ముగింపు ఇవ్వాల్సింది. ఓవరాల్ గా ఈ లియో సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ, ఆ ఎమోషన్ లో కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు లోకేష్ కనకరాజ్ కొన్ని సన్నివేశాలను ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన లియో కథాకథనాలను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు పర్వాలేదు.

మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ తగ్గించాల్సింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు :

‘లియో’ అంటూ భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో విజయ్ నటన మరియు యాక్షన్ సీన్స్ , క్లైమాక్స్ బాగున్నాయి. ఐతే, సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ… ఆ ఎమోషన్ లో, ఆ కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. దీనికితోడు సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి.

ఓవరాల్ గా విజయ్ అభిమానులను మాత్రమే ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.

English Review