Kushi (2023) Telugu Movie Review

Kushi

ఖుషి మూవీ రివ్యూ – Kushi Movie Review

విజయ్ దేవరకొండ, సమంత కలయికలో శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఖుషి. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

విప్లవ్ దేవరకొండ (విజయ్ దేవరకొండ) ఆరాధ్య (సమంత)ను చూసి తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. అతన్ని దూరం పెట్టడానికి ఆరాధ్య ఎన్ని అబద్ధాలు చెప్పి తప్పించుకున్నా.. ఎట్టకేలకు చివరకు విప్లవ్ తో ఆమె కూడా ప్రేమలో పడుతుంది. అయితే వీరి ప్రేమకు ఆరాధ్య తండ్రి మరియు ప్రవచన కర్త చదరంగం శ్రీనివాసరావు (మురళీ శర్మ) అంగీకరించడు. అటు విప్లవ్ తండ్రి మరియు నాస్తికుడైన సత్యం (సచిన్ ఖేడేకర్) కూడా వీరి పెళ్లిని అంగీకరించడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో తల్లిదండ్రులను ఎదిరించి విప్లవ్ – ఆరాధ్య పెళ్లి చేసుకుంటారు. మరి పెళ్లి తర్వాత వీరి జీవితం ఎలా సాగింది ?, వీరి లైఫ్ లో జరిగిన ఊహించని మలుపులు ఏమిటి ?, చివరకు విప్లవ్ – ఆరాధ్య కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

గుడ్ కాన్సెప్ట్ తో పాటు ఫీల్ గుడ్ లవ్ సీన్స్ మరియు ఎమోషనల్ గా సాగే ఫ్యామిలీ ఎమోషన్స్.. అలాగే డీసెంట్ గా అనిపించే నటీనటుల పనితీరు ఈ ఖుషికి హైలైట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా ఓ ప్రవచన కర్త – ఓ నాస్తికుడి మధ్య జరిగిన సంఘర్షణ.. ప్రేమ కథలో కూడా కాన్ ఫ్లిక్ట్ ను పెంచడం చాలా బాగుంది. విజయ్ దేవరకొండ – సమంత కూడా తమ పాత్రలకు ప్రాణం పోశారు. అలాగే శివ నిర్వాణ రాసిన కథ మరియు పాత్రలు కూడా కొత్తగా పెళ్లి అయిన వారి జీవితాల్లోని సంఘటనలు పరిస్థితుల ఆధారంగా సాగుతూ ఆకట్టుకుంటాయి.

భర్త పాత్రలో విజయ్ దేవరకొండ చక్కని నటనను కనబరిచాడు. పెళ్లి అయిన తర్వాత ఓ సగటు భర్తగా చాలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. మెయిన్ గా సెకెండ్ హాఫ్ లో హోమం సీక్వెన్స్ లో అలాగే సమంత వెళ్ళిపోయాక వచ్చే సీన్స్ లో విజయ్ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. అలాగే విజయ్ కి – సమంతకి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది

ఇక కథానాయకగా నటించిన సమంత తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. చదరంగం శ్రీనివాసరావుగా మురళీ శర్మ, నాస్తికుడు సత్యంగా సచిన్ ఖేడేకర్ తమ నాచ్యురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో కనిపించిన రోహిణి, లక్ష్మి కూడా బాగా నటించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు శివ నిర్వాణ తీసుకున్న కథాంశం బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా సాగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లోని కశ్మీర్ సీక్వెన్స్ అలాగే సెకెండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే స్లోగా సాగుతుంది. ఇక హీరోహీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స కూడా రెగ్యులర్ గానే సాగుతాయి. మొత్తానికి దర్శకుడు తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ సీన్స్ ను ట్రిమ్ చేసి వుంటే సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేది.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. శివ నిర్వాణ దర్శకుడిగా మంచి కథాంశంతో ఆకట్టుకున్నాడు. అలాగే ఆయన టేకింగ్ కూడా చాలా బాగుంది. సంగీత దర్శకుడు హిషామ్ అబ్ధుల్ వహాబ్ అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో చాలా బాగుంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాతలు నవీన్ ఎర్నేని-వై.రవిశంకర్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు :

ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంది. దర్శకుడు శివ నిర్వాణ నాస్తికత్వానికి – భక్తికి సంబంధించి మంచి పాయింట్ ను తీసుకుని.. భార్యాభర్తల మధ్య మంచి ఎమోషనల్ సన్నివేశాలతో బాగానే ఆకట్టుకున్నాడు. గుడ్ కాన్సెప్ట్, ఫీల్ గుడ్ లవ్ సీన్స్, ఎమోషనల్ గా సాగే ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాలో హైలైట్స్ గా నిలిచాయి. ఐతే, ఈ సినిమాలో కొన్ని సీక్వెన్స్ స్లోగా సాగడం, అలాగే కొన్ని రొటీన్ సీన్స్ సినిమాకి మైనస్ అయ్యాయి. కాకపోతే, విజయ్ దేవరకొండ – సమంత తమ నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకువెళ్లారు. ముఖ్యంగా వారిద్దరీ కెమిస్ట్రీ చాలా బాగుంది. ఓవరాల్ గా ఈ ఖుషి ప్రేక్షకులను బాగా మెప్పిస్తోంది.

English Review

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *