Konda Polam 2021 Telugu Movie Review

Konda

కొండ పొలం మూవీ రివ్యూ – Konda Polam Movie Review

వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘కొండపొలం’. ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ లో రాజీవ్ రెడ్డి, సాయి బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :




గొర్రెలు కాసుకునే కుటుంబంలో పుట్టిన రవి (పంజా వైష్ణవ్ తేజ్) ఇంజనీరింగ్ వరకూ చదివి జాబ్ కోసం నాలుగేళ్లు రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. ఈ క్రమంలో తన వాళ్ళతో కలిసి కొండపొలానికి గొర్రెలు కాయడానికి వెళ్లాల్సి వస్తోంది. ఆ అడవిలో రవికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ? ఎలాంటి ఆపదలు ఎదురయ్యాయి ? వాటిని అతను ఎలా ఎదిరించి గెలిచాడు ? ఈ మధ్యలో అడవి నుంచి అతను నేర్చుకున్నది ఏమిటి ? అతని జీవితాన్ని ఆ కొండపొలం ఎలా మార్చింది ? ఈ మధ్యలో ఓబులమ్మ (రకుల్ ప్రీత్ సింగ్) తో అతను ఎలా ప్రేమలో పడ్డాడు ? వాళ్ల ప్రేమకు నిలిచిన అడ్డుగోడను అతను ఎలా అధిగమించి ఓబులమ్మ ప్రేమను గెలుచుకున్నాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్… ఈ కథ జరిగిన నేపథ్యం, సహజంగా సాగే పాత్రలు, సినిమా చూస్తున్నంత సేపు ఆ ప్రాంతానికి వెళ్లి ఆ పాత్రలను మనం దగ్గరనుండి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక రవి పాత్రలో వైష్ణవ్ తేజ్ చాలా బాగా నటించాడు. ఎమోషనల్‌ గా సాగే తన పాత్రలో తన కళ్లతోనే సున్నితమైన భావోద్వేగాలు పండించాడు. దర్శకుడు క్రిష్ రాసుకున్న కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు, అడవిలో పులి ఫైట్ ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే క్రిష్ టేకింగ్ సినిమాకు కావాల్సినంత సహజత్వాన్ని అందించింది.

ఇక ఓబులమ్మగా రకుల్ నటన ఆకట్టయింది. సినిమాలో లవ్ ట్రాక్ కూడా చాలా బాగా కుదిరింది. ముఖ్యంగా కథనం స్లో అవుతుందనుకునే సమయానికి ఒక ఎమోషనల్ సీన్ వస్తూ సినిమా పై ఆసక్తిని పెంచుతుంది. కథలో అంతర్లీనంగా ఇచ్చిన మెసేజ్ కూడా బాగుంది. అడవిలో హీరోకు ఎదురయ్యే అనుభవాలను, చివర్లో అతని సక్సెస్ కి లింక్ చేస్తూ చెప్పిన విధానం బాగుంది.

సినిమా కొన్ని చోట్ల పాత్రలకు ఏం జరుగుతుందో అనే ఉత్సుకతను కూడా దర్శకుడు బాగా మెయింటైన్ చేశాడు. తాతగా కోట, తండ్రిగా సాయిచంద్ చాలా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :




సినిమాలో మొదటి నుంచి ప్లే స్లోగానే సాగుతోంది. కథా నేపథ్యం, పాత్రల చిత్రీకరణ, నటీనటుల పనితీరు బాగున్నా.. కథనం విషయంలో, కథను మొదలు పెట్టడంలో మాత్రం క్రిష్ చాలా నెమ్మదిగా కనిపించారు. ఇక పాత్రల మధ్య ఎమోషన్స్ ను బాగా ఎస్టాబ్లిష్ చేసినా… కొన్ని చోట్ల మెలోడ్రామాలా అనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ కామెడీ కోసం పెట్టిన అమవసరమైన డిస్కషన్ బోరింగ్ గా సాగుతుంది.

దీనికి తోడు కామెడీ కోసం పెట్టిన ఆ రెండు పాత్రలు సినిమాలో ల్యాగ్ పెంచడానికే ఉపయోగపడ్డాయి. ఇక సినిమాలో సెకండాఫ్ కూడా స్లోగా సాగింది. ప్రధానంగా కొన్ని సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. నేపథ్యం కొత్తగా తీసుకున్నా… కొన్ని సన్నివేశాలు రొటీన్ గానే సాగాయి.

సాంకేతిక విభాగం :

క్రిష్ దర్శకుడిగా ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశారు. అయితే ఆయన కథనం మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. సినిమా స్క్రిప్ట్ పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సంగీత దర్శకుడు కీరవాణి అందించిన సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫర్ జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయింది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి. సంభాషణలు బాగున్నాయి. నిర్మాతల ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.

తీర్పు :

అడవి నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ ‘కొండపొలెం’లో ఎమోషన్స్, పులి ట్రాక్, కొన్ని అడవి నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీన్స్, మరియు పాత్రల మధ్య సున్నితమైన సంఘర్షణలు ఆకట్టుకున్నాయి. అయితే, స్లో నేరేషన్, పూర్తిస్థాయిలో కమర్షియల్ అంశాలు లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.

English Review