Pushpa 2021 Telugu Movie Review

పుష్ప మూవీ రివ్యూ – Pushpa Movie Review

అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన సినిమా ‘పుష్ప- ది రైజ్’. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సునీల్, అనసూయ, ధనుంజయ, ఫహాద్ ఫాజిల్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. కాగా పాన్ ఇండియా సినిమాగా నేడు ఈ చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

కథ :




పుష్ప రాజ్ (అల్లు అర్జున్) ఉంచుకున్న దాని కొడుకుగా ఇంటిపేరు కూడా లేకుండా సమాజంలో ఎన్నో అవమానాలను బాధలను ఎదుర్కొని కసితో పెరుగుతాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే ముఠాలో కూలీవాడిగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్ తన ధైర్యసాహసాలతో ఆ ముఠా నాయకుడు కొండారెడ్డి (అజయ్ ఘోష్)కి పార్టనర్ గా మారతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఎర్రచందనం సిండికేట్ హెడ్ మంగళం శ్రీను (సునీల్)ను ఎదిరించి.. పుష్పరాజ్ తానే సిండికేట్ హెడ్ గా రూపాంతరం చెందుతాడు. ఈ మధ్యలో శ్రీవల్లీని (రష్మిక మందన్న) చూసి ప్రేమలో పడిన పుష్పరాజ్ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? ఆమెను ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఆలాగే ఎర్రచందనం సిండికేట్ ను గుప్పిట్లో పెట్టుకున్న పుష్పరాజ్ ని టార్గెట్ చేసే వ్యక్తి ఎవరు? అసలు భన్వర్ సింగ్ షెఖావత్ (ఫహాద్ ఫాజిల్)తో పుష్ప రాజ్ కి వచ్చిన సమస్య ఏమిటి? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

‘తగ్గేదే లే’ అంటూ భారీ అంచనాలతో వచ్చిన ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్, ఆ అంచనాలకు తగ్గట్టుగానే.. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాలో మరియు గ్రాండ్ విజువల్స్ లో ఏ మాత్రం తగ్గలేదు. కథలోని మెయిన్ ఎమోషన్స్ ను, బన్నీ పాత్రలోని షేడ్స్ ను, రష్మిక మండన్నాతో సాగే లవ్ ట్రాక్ ను, అలాగే అడవి నేపథ్యాన్ని.. ఆ నేపథ్యంలోని ఎర్రచందనం మెయిన్ యాక్షన్ సీక్వెన్సెస్ ను.. ఇలా సుకుమార్ ప్రతి పాత్రను, ప్రతి ట్రాక్ ను చాలా బాగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా బన్నీ పాత్రలోని ఎలివేషన్ సన్నివేశాలు విశేషంగా అలరిస్తాయి.

ఇక ‘పుష్ప’రాజ్‌’ పాత్రకు అల్లు అర్జున్‌ ప్రాణం పోశారు. మునుపెన్నడూ చూడని విధంగా రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో బన్నీ అద్భుతంగా నటించాడు. నిజంగానే కుడి భుజం వంగి పోయినట్టు చాలా సహజంగా కనిపించాడు. బన్నీ – రష్మిక ఆన్‌ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. అన్నట్టు శ్రీవల్లీగా రష్మిక మందన్న డీ గ్లామర్ లుక్ లో కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. నటన పరంగానూ రష్మిక ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కింది.

హీరోయిన్ సమంత చేసిన స్పెషల్ సాంగ్ థియేటర్స్ లో విజిల్స్ వేయించింది. కీలక పాత్రలో నటించిన ఫహద్ ఫాజిల్ పర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్‌ గా బాగుంది. మంగళం శ్రీనుగా సునీల్ కొత్తగా కనిపించాడు. సునీల్ కెరీర్ లో నిలిచిపోయే పాత్ర ఇది. దాక్షాయణిగా అనసూయ నటన కూడా బాగుంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :




పుష్పరాజ్ పాత్ర, కథా నేపథ్యం, అలాగే ఇతర పాత్రల చిత్రీకరణ, నటీనటుల పనితీరు బాగున్నా.. కథనం విషయంలో, కథను మొదలు పెట్టడంలో మాత్రం సుకుమార్ చాలా స్లోగా ప్లేను నడిపాడు. పాత్రల మధ్య ఎమోషన్స్ ను బాగానే ఎస్టాబ్లిష్ చేసినా… కొన్ని చోట్ల అవి మెలోడ్రామాలా అనిపిస్తాయి. దీనికి తోడు పాత్రలు ఎక్కువ అవ్వడం, పైగా మధ్యమధ్యలో ఆ పాత్రలను పరిచయం చేస్తూ వాయిస్ ఓవర్ వస్తూ ఉండటం, అలాగే అక్కడక్కడా కామెడీ కోసం పెట్టిన అమవసరమైన డిస్కషన్ కూడా సినిమా స్థాయుకి తగ్గట్టు లేదు.

ఇక సినిమాలో సెకండాఫ్ అయితే మరీ స్లోగా సాగింది. ప్రధానంగా కొన్ని సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. నేపథ్యం కొత్తగా తీసుకున్నా… కొన్ని సన్నివేశాలు రొటీన్ గానే సాగాయి. ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిందనే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నట్లు స్మగ్లింగ్ సీన్స్ నే ఎక్కువ పెట్టారు. పోలీసుల నుంచి హీరో ఎదుర్కొనే అవరోధాలు, అటాక్ లు కూడా పూర్తి సినిమాటిక్ గానే సాగాయి. అలాగే సెకెండ్ పార్ట్ పై ఆసక్తి తారాస్థాయికి తీసుకువెళ్ళగలిగే ముగింపును కూడా ఇవ్వలేకపోయారు. పుష్పరాజ్ – భన్వర్ సింగ్ మధ్య కాన్ ఫ్లిక్ట్ కూడా ఇంకా బలంగా ఉండాల్సింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగానికి వస్తే.. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బాగా ఆకట్టుకుంది. ‘దాక్కో దాక్కో మేక’, ‘శ్రీవల్లి’, ‘సామి’, ‘ఏయ్‌ బిడ్డా’ ఇలా సాంగ్స్ అన్ని బాగున్నాయి. అయితే, అన్ని సాంగ్స్ లో కల్లా ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ పాట మాత్రం ప్రేక్షకులను ఇంకా బాగా అలరిస్తోంది. దేవి అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. కుబ బ్రోజెక్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఎంతో రియలిస్టిక్ గా, గ్రాండ్ విజువల్స్ తో ప్రతి సీన్ ను కుబ చాలా బ్యూటిఫుల్ గా చూపించాడు.

ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ సినిమాలోని స్లో సీన్స్ ను తగ్గించి ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్.వై ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నేషనల్ రేంజ్ లో భారీగా నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. రచయితగా తడబడినా దర్శకుడిగా మాత్రం సుకుమార్ బాగా ఆకట్టుకున్నాడు.

తీర్పు :

‘తగ్గేదే లే’ అంటూ హై ఓల్టేజ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో డిఫరెంట్ షేడ్స్ తో వచ్చిన పుష్పరాజ్ బాగానే ఆకట్టుకున్నాడు. బన్నీ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇచ్చింది ఈ సినిమా. అలాగే ఇంట్రస్ట్ గా సాగే హీరో క్యారెక్టరైజేషన్ మరియు గ్రాండ్ విజువల్స్, లవ్ ట్రాక్, ఎర్రచందనం మెయిన్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. కాకపోతే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, 2nd పార్ట్ పై ఆసక్తి తారాస్థాయికి తీసుకువెళ్ళగలిగే ముగింపు లేకపోవడం, ఇక కొన్ని సీన్స్ బోర్ కొట్టించడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఆడియన్స్ కి ఈ సినిమా ఎవరేజ్ గా అనిపిస్తుంది. కానీ బన్నీ ఫ్యాన్స్ కి మాత్రం మంచి అనుభూతిని ఇస్తోంది.

English Review