Hawaa 2019 Telugu Movie Review

Hawaa

హవా మూవీ రివ్యూ ఆడియో – Hawaa Movie Review Audio




 

చైతన్య మాదాడి, దివి ప్రసన్న జంటగా మహేష్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ స్టోరీ ‘హవా’ నేడు విడుదలైంది. మరి మూవీ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి  తెలుసుకుందాం.

కథ :

మూవీ మొత్తం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నేపథ్యంలో సాగుతుంది. చార్లీ (చైతన్య మాదాడి) చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి జీవనం కోసం చిన్న చిన్న నేరాలు చేస్తూ పెరుగుతాడు. వీటితో విసిగిపోయిన చార్లీ ఏదైనా పెద్ద క్రైమ్ చేసి సెటిల్ అయిపోవాలని నిర్ణయించుకొని ఆస్ట్రేలియాలోని డార్క్ హార్స్ రైడింగ్ బెట్టింగ్ మాఫియాలోకి అడుగుపెడతాడు. కానీ అప్పటికే అక్కడ పాతుకుపోయి వున్న మాఫియా గ్యాంగ్స్ తో చార్లీకి ప్రాణహాని తలెత్తుతుంది. ఆ క్రిమినల్ గ్యాంగ్స్ బారి నుండి చార్లీ ఎలా తప్పించుకున్నాడు ? మరి చార్లీ తన కలలని నెరవేర్చుకున్నాడా ? లేదా ? అనేది తెర పై చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

దాదాపు ఆస్ట్రేలియా లో తెరకెక్కిన ఈ చిత్ర నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. మూవీలో ప్రధాన పాత్ర చేసిన చైతన్య డీసెంట్ నటనతో ఆకట్టుకున్నాడు. మూవీ మొత్తం ఆయన పాత్ర ప్రధానంగా సాగుతుంది. ఇక హీరోయిన్ గా చేసిన దివి ప్రసన్న దక్కిన కొద్దిపాటి నిడివి కలిగిన పాత్రలో మెప్పించింది.

ఇక మూవీ పతాక సన్నివేశం వివరించిన తీరు ఆకట్టుకుంటుంది. కథలో మలుపులను ఆసక్తికరంగా తెరకెక్కించిన విధానం, సస్పెన్సు ని క్యారీ చేసిన పద్దతి బాగుంది. అలాగే సిడ్నీ నగర అందాలను బందించి తెరపై ఆవిష్కరించడంలో కెమెరా పనితం అబ్బురపరిచింది.




మైనస్ పాయింట్స్ :

ఈ మూవీలో అతి పడ్డ బలహీనత స్క్రీన్ ప్లే. ఏమాత్రం ఆకట్టుకొని స్క్రీన్ ప్లే ప్రేక్షకుడు సహనాన్ని పరీక్షిస్తుంది. కథలో అనేక వేరియేషన్స్ ఉన్నప్పుడు వాటిని తెరపై ఆసక్తికరంగా మలిచే అద్భుతమైన స్క్రీన్ ప్లే అనేది చాలా అవసరం. ఆ విషయంలో ఈ మూవీ నిరాశ పరుస్తుంది.

హవా చిత్రంలో నటించిన నటులందరూ దాదాపు కొత్తవారు కావడంతో పరిపక్వత లేని నటనతో ఇబ్బందిపెడతారు. అలాగే కామెడీ సన్నివేశాలు చాలా చౌకబారు గా మరియు సిల్లీ గా అనిపిస్తాయి. అలాగే చిత్రంలోని పాత్రలను ముగించిన విధానం అసంపూర్తిగా ఉంది.

సజావుగా సాగని సన్నీ వేషాలతో మొదటి సగం సహనానికి పరీక్ష పడుతుంది. మొదటి సగంతో పోల్చుకుంటే రెండవ సగం కథలోని అసలు మలుపులు బయటపెడుతూ కొంచెం పర్వాలేదన్నట్లుగా సాగుతుంది.

సాంకేతిక విభాగం :

ముందుగా చెప్పిన ప్రకారం మూవీ నిర్మాణ విలువలు బాగున్నాయి. గిఫ్టన్ ఎలియాస్ అందించిన సంగీతం డీసెంట్ గా పరవాలేదు అనిపించింది. బీజీఎమ్ కూడా కొంత వరకు ఆకట్టుకుంటుంది. కథ పరిమితికి తగ్గట్టుగా నిడివితో ఎడిటింగ్ బాగుంది. ఇక చిత్రంలో లాజిక్ లేని సన్నివేశాలు అనేక అనుమానాలు కలిగిస్తాయి. ఇక దర్శకుడు మహేష్ రెడ్డి చిత్రంలో ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయాడు. కథ చెప్పే విధానంలో స్పష్టత లోపించటంతో ఎమోషన్స్ అనేవి తెరపై ఆవిష్కృతం కాలేదు. కథలోని కీలక మలుపుని చెప్పే విధానం మెప్పించలేదు. దీనితో ప్రేక్షకుడు గందర గోళానికి గురవుతాడు.

తీర్పు :

సీరియస్ నెస్ లేని ఒక సాధారణ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ ‘హవా’ మూవీ మిగిలిపోతుంది. నిర్మాణ విలువలు మరియు కెమెరా వర్క్ మినహాయిస్తే బలం లేని భావోద్వేగాలు, ఆ భావోద్వేగాలతో నిండి ఉన్న కథ, దానిని తెరకెక్కించిన విధానం, ఏ మాత్రం ఆకట్టుకోవు. ఓవరాల్ గా ఈ సినిమా నిరుత్సాహ పరుస్తోంది.

English Review